జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఈ నెల 24 నుంచి జులై 3 వరకు 18వ లోక్ సభ తొలి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తెలిపారు.

Update: 2024-06-12 06:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 24 నుంచి జులై 3 వరకు 18వ లోక్ సభ తొలి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తెలిపారు. తొమ్మిది రోజుల ప్రత్యేక సెషన్‌లో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అలాగే జూన్ 27 నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. ఇవి కూడా జూలై 3నే ముగియనున్నాయి. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇవే తొలి సమావేశాలు కావడం గమనార్హం.

సభా కార్యకలాపాలు ప్రారంభమైన తొలి మూడు రోజుల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేసి లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాబోయే ఐదేళ్ల కోసం కొత్త ప్రభుత్వ ప్రణాళికలను వెల్లడించే చాన్స్ ఉంది. ప్రెసిడెంట్ స్పీచ్ తర్వాత ప్రధాని మోడీ తన మంత్రి వర్గాన్ని పార్లమెంటుకు పరిచయం చేస్తారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. దీనిపై ప్రధాని సమాధానం ఇస్తారు. మరోవైపు ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వివిధ అంశాలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. 


Similar News