ఉభయసభల్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. కీలక అంశాలివీ

దిశ, నేషనల్ బ్యూరో: ‘నీట్’ పరీక్ష పేపర్‌‌ను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభల సాక్షిగా ప్రకటించారు.

Update: 2024-06-27 18:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ‘నీట్’ పరీక్ష పేపర్‌‌ను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభల సాక్షిగా ప్రకటించారు. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ప్రస్తుతం ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా అమల్లోకి తెచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని అధికార, విపక్షాలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. నాలుగో రోజు (గురువారం) పార్లమెంటు సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కొత్తగా కొలువుదీరిన 18వ లోక్‌సభతో పాటు రాజ్యసభను ఉద్దేశించి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తొలుత రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్వాగతం పలికారు.

రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌..

70 ఏళ్లు పైబడిన ప్రతీ దేశ పౌరుడికి ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య బీమా పథకం కింద ఉచిత చికిత్స అందిస్తామని రాష్ట్రపతి ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. దేశంలో 25వేల జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. జులై 1 నుంచి దేశంలో కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని ఆమె వెల్లడించారు. ‘‘జమ్మూకశ్మీర్​పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో కశ్మీర్‌ లోయలో మార్పు కన్పించింది. శత్రువులకు గట్టిగా బదులిస్తూ జమ్ముకశ్మీర్‌ ప్రజలు పెద్దసంఖ్యలో ఓటింగ్​లో పాల్గొన్నారు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 18వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన భారత ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని రాష్ట్రపతి చెప్పారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ వృద్ధిలో భారత్‌ వాటా 15 శాతంగా ఉన్నట్లు తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించిందని రాష్ట్రపతి చెప్పారు. గత పదేళ్లలో విమాన రూట్లు పెరగడంతో దేశంలోని టైర్2, టైర్3 నగరాలు ఎక్కువ ప్రయోజనం పొందాయన్నారు.

మరిన్ని బుల్లెట్ రైలు కారిడార్‌లు

దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైలు కారిడార్‌ల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్రపతి ప్రకటించారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరుగుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు పూర్తయితే అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రయాణాలు వేగంగా సాగుతాయన్నారు. గత పదేళ్లలో మెట్రో రైళ్ల వ్యవస్థ 21 నగరాలకు చేరుకుందని, మరిన్ని నగరాలకు మెట్రోను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని ముర్ము తెలిపారు. 508 కి.మీల అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ కారిడార్‌లో దేశంలోనే మొదటి సారిగా బుల్లెట్ రైలు పరుగులు తీయనుందన్నారు.

1975 ఎమర్జెన్సీపై ఏమన్నారంటే..

1975 సంవత్సరం జూన్ 25న ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తప్పుపట్టారు. ఎమర్జెన్సీ రోజులను దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ఎమర్జెన్సీని ప్రకటించడం ద్వారా నాటి ప్రభుత్వం నేరుగా రాజ్యాంగంపై దాడికి పాల్పడిందని ఆమె విమర్శించారు. అలాంటి రాజ్యాంగేతర శక్తులతోనూ పోరాడి దేశం విజయవంతమైన రిపబ్లిక్‌గా నిలువగలిగిందన్నారు. ‘‘రాజ్యాంగ రచన జరిగిన సమయంలోనూ కొన్ని శక్తులు కుట్రలు, కుయుక్తులు పన్నాయి. మన దేశం విఫలం కావాలని కోరుకున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దానిపై చాలాసార్లు దాడికి తెగబడ్డాయి’’ అని రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఈశాన్య ప్రాంతాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి వాటికి బడ్జెట్ కేటాయింపులను 4 రెట్లు పెంచామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఈశాన్య ప్రాంతాన్ని స్ట్రాటజిక్ గేట్‌వేగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, నీట్ పరీక్ష, కొత్త న్యాయచట్టాల గురించి రాష్ట్రపతి ప్రస్తావించిన సమయంలో పలువురు విపక్ష నేతలు లేచి నిలబడి కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నినాదాలు చేశారు. కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు.

ఉభయసభలు వాయిదా..

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల్లో సమావేశాలు మొదలుకానున్నాయి. అంతకుముందు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులను పరిచయం చేసేందుకు ప్రధాని మోడీ గురువారం రాజ్యసభకు వెళ్లగా.. ఆయనకు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ స్వాగతం పలికారు. రాజ్యసభా పక్ష నేతగా జేపీ నడ్డా వ్యవహరిస్తారని జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News