Parliament: పార్లమెంటులో ఆగని ప్రతిపక్షాల నిరసనలు..

పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాలని పట్టుపడుతున్న విపక్షాలు

Update: 2023-07-28 14:10 GMT

న్యూఢిల్లీ : పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాలని పట్టుపడుతున్న విపక్షాలు.. ఉభయసభల్లో నిరసనలు కొనసాగిస్తుండటంతో శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానంపై తక్షణమే చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో "ఎంతో కీలకమైన ప్రశ్నోత్తరాలను అనుమతించాలని మీరు కోరుకోవడం లేదా" అని విపక్షాలను స్పీకర్‌ ప్రశ్నించారు. 1978 మే 10న పెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ అనుమతించిన వెంటనే చర్చ జరిగిందని.. కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్ రంజన్‌ చౌదరి గుర్తుచేశారు. అయితే 10 రోజుల్లోపు అవిశ్వాసంపై ఎప్పుడైనా చర్చించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

ప్రతిపక్షాలకు సభలో తగిన బలం ఉంటే.. బిల్లులను అడ్డుకోవాలన్నారు. అవిశ్వాస తీర్మానంపైనే వెంటనే చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభ కార్యక్రమాలు జరగకూడదనే దురుద్దేశంతోనే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. "మణిపూర్ ఘటనపై సభలో మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడాలి, నిజం బయటకు రావాలని ప్రతిపక్షాలు అనుకుంటే సభ కంటే మంచి స్థలం మరొకటి లేదు" అని పేర్కొన్నారు. లోక్ సభలో విపక్ష సభ్యులు మణిపూర్ హింసపై ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో సభను తొలుత మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం లోక్ సభ ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

శనివారం నుంచి మణిపూర్‌లో ప్రతిపక్ష పార్టీల బృందం పర్యటించనున్న నేపథ్యంలో బీజేపీ లోక్ సభ ఎంపీ రవికిషన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ప్రతిపక్షాలు ఎక్కడికైనా వెళ్లొచ్చు. అవసరమైతే పాకిస్థాన్, శ్రీలంక, చైనాలకు కూడా వెళ్లాలి’’ అని కామెంట్ చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌ వైఫరీ కమిషన్ బిల్లు, ది నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లులను లోక్ సభ ఆమోదించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-2017 సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపు చర్చ జరిగాక సోమవారానికి లోక్ సభ వాయిదా పడింది.

రాజ్యసభలో 47 మంది ఎంపీలు నోటీసులు.. ఏమైందంటే?

రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసన కారణంగా ఎలాంటి చర్చ జరగలేదు. మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలకు చెందిన 47 మంది ఎంపీలు నోటీసులు ఇవ్వగా.. స్వల్పకాలిక చర్చకు అంగీకరిస్తున్నానని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కఢ్ అన్నారు. ప్రశ్నోత్తరాలు కూడా ఎంతో ముఖ్యమని వివరించారు. ఆ విషయాలు తమకు తెలుసని, విపక్షాలు ఇచ్చిన నోటీసులపై చర్చ జరగాలని తృణమూల్ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియన్‌ కోరారు. ఈ క్రమంలో ఓబ్రెయిన్‌ తీరుపై ఛైర్మన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ స్థానంపై కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఓబ్రెయిన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును వచ్చే వారం రాజ్యసభలో ప్రవేశ పెడతామని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ దేశవ్యాప్తంగా ఒకే సివిల్ కోడ్‌ను అమలు చేయడానికి చట్టాన్ని రూపొందించే ప్రతిపాదనను వచ్చే వారం లోక్ సభ ముందుకు తీసుకురానున్నారు.


Similar News