పద్మశ్రీ గ్రహీత కమలా పూజారి కన్నుమూత..సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సేంద్రియ రైతు కమలా పూజారి(74) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె రెండు రోజుల క్రితం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ ఆస్పత్రిలో చేరారు.

Update: 2024-07-20 17:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సేంద్రియ రైతు కమలా పూజారి(74) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె రెండు రోజుల క్రితం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోరాపుట్ జిల్లాలోని బైపరిగూడ బ్లాక్‌లోని పట్రాపుట్ గ్రామంలో జన్మించిన కమల సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌తోనూ అనుబంధం కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. అలాగే 2002లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ‘ఈక్వేటర్ ఇనిషియేటివ్’ అవార్డు, 2004లో ఒడిశా ప్రభుత్వంచే ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. కమలా పూజారి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. కమలా పూజారి మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సైతం సంతాపం వ్యక్తం చేశారు. కమలా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News