అస్సాం వరదల వల్ల 3.90 లక్షల మంది ప్రభావితం

ఇటీవల భారీ వర్షాలు అస్సాంను ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి.

Update: 2024-06-22 08:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల భారీ వర్షాలు అస్సాంను ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం అస్సాంలో మొత్తం పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ నేపథ్యంలో వరదల కారణంగా 3.90 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని అధికారులు శనివారం తెలిపారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. 171,000 మందికి పైగా ప్రజలు తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులు కాగా, 15,160 మంది తాత్కాలిక సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారని అధికారులు తెలిపారు.

రెమల్ తుఫాను ప్రభావంతో అస్సాంలో భారీ వరదలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 17 జిల్లాల్లో 245 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. మరోవైపు అత్యధికంగా కరీంగంజ్ జిల్లాలో 2.40 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి, బీపీ ఘాట్ వద్ద బరాక్, కరీంగంజ్‌లోని కుషియారా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినప్పటికీ, 19 జిల్లాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఇళ్లు, పశువుల కొట్టాలు, రోడ్లు, వంతెనలు, కట్టలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు.


Similar News