NEET-UG: ఎగ్జామ్ సెంటర్ల వారీగా నీట్ ఫలితాలు విడుదల

ట్‌-యూజీ 2024 (NEET-UG) పరీక్షలో పేపర్‌ లీకేజీలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2024-07-20 08:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్‌-యూజీ 2024 (NEET-UG) పరీక్షలో పేపర్‌ లీకేజీలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు, ఎగ్జామ్ సెంటర్ల వారీగా నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. ఫలితాలు వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపును బయటపెట్టలేదు. నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎగ్జామ్ సెంటర్ల వారీగా ఫలిచాలు విడుదల చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే పేపర్ లీక్ అయినట్లు అనుమానిస్తున్న ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు రాసిన వారికి వచ్చిన మార్కుల గురించి తెలుసుకోవడానికే ఈ లిస్ట్ అడుగుతున్నట్లు తెలిపింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, అయితే విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ శనివారం ఫలితాలు విడుదల చేసింది. ఇకపోతే, ఈ వ్యవహారంపై జులై 22న తదుపరి విచారణ జరగనుంది. ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో నీట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 24 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో 14 సెంటర్లు విదేశాల్లో ఉన్నాయి.


Similar News