'మహిళా రిజర్వేషన్స్ 2024లోనే తీసుకురండి'

మహిళా సాధికారతపై బీజేపీ సీరియస్‌గా లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు.

Update: 2023-09-21 15:07 GMT

న్యూఢిల్లీ : మహిళా సాధికారతపై బీజేపీ సీరియస్‌గా లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2024లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని లేదంటే రాజ్యసభలో మహిళలకు 33 శాతం కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నుంచి మూడో వంతు లోక్ సభ టికెట్లను మహిళలకే కేటాయించాలని కోరారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై గురువారం సాయంత్రం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఓబ్రెయిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా సాధికారతపై బీజేపీకి పట్టింపు లేదు. గత అసెంబ్లీ పోల్స్‌లో బెంగాల్‌లో మమతా బెనర్జీని అడ్డుకునేందుకు యత్నించి బీజేపీ ఫెయిల్ అయింది.

దీదీ సర్కారులోని ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ, భూమి, పరిశ్రమలు, వాణిజ్య శాఖలను మహిళలే నిర్వహిస్తున్నారు. 16 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఒక్క మహిళా సీఎం కూడా లేరు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పురుషులు, స్త్రీల లక్షణాలను పొందితే దేవతలవుతారు. స్త్రీలు, పురుషుల లక్షణాలను పొందితే రాక్షసులవుతారు అని చెప్పారు. దీన్ని బట్టి బీజేపీ నేతల మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. బీజేపీ నేతల ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉందని చెప్పారు.


Similar News