కశ్మీర్‌లో ఆగని ఉగ్రదాడులు..మూడు రోజుల్లోనే 3 ఘటనలు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మూడు రోజుల్లోనే 3 సార్లు దాడులకు పాల్పడ్డారు. జూన్ 9వ తేదీన రియాసిలో బస్సుపై దాడి జరిగిన తర్వాత మరో రెండు దాడులు చేశారు.

Update: 2024-06-12 03:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మూడు రోజుల్లోనే 3 సార్లు దాడులకు పాల్పడ్డారు. జూన్ 9వ తేదీన రియాసిలో బస్సుపై దాడి జరిగిన తర్వాత మరో రెండు దాడులు చేశారు. మంగళవారం సాయంత్రం కథువా జిల్లా హీరానగర్‌లోని సైదా సుఖల్ గ్రామంలో ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు ఓ టెర్రరిస్టును మట్టుబెట్టాయి. ఇది జరిగిన కాసేపటికే దోడాలోని ఛత్తర్‌గాలాలోని 4 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల జాయింట్ చెక్ పోస్ట్‌పై అటాక్ చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులు, ఓ ప్రత్యేక పోలీసు అధికారి గాయపడ్డారు.

ఈ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ తెలిపారు. ఈ దాడులన్నీ ఉగ్ర కదలికలు లేని గ్రామాల్లో జరిగినట్టు వెల్లడించారు. మొదటిగా దాడి చేసే ముందు ఉగ్రవాదులు పలు ఇళ్లకు వెళ్లి నీళ్లు అడిగారని, ఈ క్రమంలోనే పౌరులపై కాల్పులకు తెగపడ్డట్టు తెలిపారు. అయితే ఇక్కడ ముగ్గురు పౌరులు మరణించారని పుకార్లు వెలువడగా దానిని ఆనంద్ జైన్ కొట్టి పారేశారు. ఈ ఘటనలో ఓ పౌరుడు మాత్రమే తీవ్రంగా గాయపడ్డాడని, ఎవరూ మృతి చెందలేదని స్పష్టం చేశారు.


Similar News