Asaduddin Owaisi: 'అవిశ్వాస తీర్మానానికి అనుమతి లభించినా నిరసన ఆపరా..?'

అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించినా పార్లమెంటు ఉభయసభల్లో నిరసనలు కొనసాగించడం సరికాదని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపక్షాలకు సూచించారు.

Update: 2023-07-27 13:24 GMT

న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించినా పార్లమెంటు ఉభయసభల్లో నిరసనలు కొనసాగించడం సరికాదని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపక్షాలకు సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్‌‌లో సజావుగా చర్చలు జరిగే వాతావరణం ఉండేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతి లభించినా నిరసనలు ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను ఒవైసీ ప్రశ్నించారు. నిరసనల కారణంగా విలువైన పార్లమెంట్‌ సమయం వృధా అవుతోందన్నారు. నిరసనలను ఆపి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వేసి, వారి వైఫల్యాలను బయటపెట్టాలని కోరారు.

ప్రశ్నోత్తరాల సమయాన్ని పార్లమెంట్ కోల్పోవడం దురదృష్టకరమని.. దానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన చెప్పారు. సభలో ఈ గందరగోళం మధ్యే ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం హడావుడిగా ఆమోదిస్తున్నదనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. ఫలితంగా ఆ బిల్లులలోని లోపాలను బయటపెట్టే ఛాన్స్‌ను కోల్పోతున్నామని చెప్పారు. ‘‘రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌‌లలో జరిగిన హింసను చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా మణిపూర్‌లో హింసను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కుకీలపై జరిగిన హింసను ఇతర రాష్ట్రాల్లోని సంఘటనలతో పోల్చడం చాలా తప్పు’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.


Similar News