బిగ్ న్యూస్: ఐక్యరాజ్యసమితి మీటింగ్‌కు ‘‘కైలాస’’ దేశ ప్రతినిధి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.

Update: 2023-02-28 08:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న ద్వీపాన్ని తన సొంత దేశంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. దీనికి కైలాస అని నామకరణం కూడా చేశారు. ఈ ద్వీపాన్ని హిందూ దేశంగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామి హిందువుల హక్కుల కోసం పోరాటం చేస్తామని చాలా కాలంగా చెబుతున్నారు. అయితే ఈ దేశంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అనూహ్యంగా కైలాస దేశం నుంచి ఓ ప్రతినిధి ఏకంగా ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరు కావడం సంచలనంగా మారుతోంది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస తరపున మాతా విజయ ప్రియా నిత్యానంద అనే మహిళ యూఎన్ఓ సమావేశానికి హాజరై తమ గళాన్ని వినిపించిందని కైలాస ద్వీపానికి సంబంధించిన ట్విట్టర్ ఖాతా ఓ ఫోటోను షేర్ చేసింది. ఫిబ్రవరి 22న జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ సమావేశానికి విజయ ప్రియ నిత్యానంత అనే మహిళ కైలాస శాశ్వత రాయబారి హోదాలో హాజరైనట్టు కైలాస రాజ్యానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతా వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారుతోంది. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే విషయంపై కైలాస ప్రతినిధి ప్రసంగించారు.

నిత్యానంద తాను పుట్టిన భారత దేశం నుంచి వేధింపులకు గురైనట్లు ఈ సమావేశంలో లేవనెత్తారు. కైలాస దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ హిందూ దేశంగా ఆమె పేర్కొన్నారు. హిందూయిజానికి అత్యున్నత మతాధికారి నిత్యనందయే అని తెలిపారు. పురాతన హిందూ విధానాలు, మరుగున పడిన 10 వేల హిందూ సంప్రదాయాలను నిత్యానంద తిరిగి పునరుద్ధరిస్తున్నారని ఆమె వెల్లడించారు.

కైలాసలోని రెండు మిలియన్ల హిందూ ప్రవాస జనాభాను హింసించడాన్ని ఆపడానికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ దౌత్యవేత్తలను ఈ సందర్భంగా ఆమె కోరారు. అలాగే హిందూ మతం సూత్రాలు, విధానాలను అంతర్జాతీయ వేదికలపై వినిపించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కైలాస సంస్థ 150 దేశాల్లో రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొన్నారు.

కాగా తనపై అత్యాచార ఆరోపణలు రావడంతో నిత్యానంద వివాదాస్పదమయ్యాయి. కర్ణాటక సెషన్స్ కోర్టు 2010లో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అతని మాజీ డ్రైవర్ లెనిన్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిత్యానందను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. అయితే 2020లో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడంటూ లెనిన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో బెయిల్‌ రద్దయింది. గాడ్ మాన్‌గా చెప్పుకుంటున్న నిత్యానందపై గుజరాత్ ఆశ్రమంలో కూడా చిన్నారులపై వేధింపులు, చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

కైలాసకు అమెరికా గుర్తింపు:

స్వయం ప్రకటిత దేశం కైలాస అసలు ఉందా లేదా అనేది ఇప్పటికి ఓ చర్చగానే ఉంది. తమ దేశానికి సంబంధించిన విషయాలను నిత్యానంద స్వామి టీమ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి ప్రకటిస్తునప్పటికీ.. వారి ప్రచారంపై ఇప్పటికి అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని ఓ రాష్ట్రంలో కైలాస రాజ్యానికి గుర్తింపు ఇవ్వడం ఆసక్తిని రేపింది.

కైలాస దేశంతో అమెరికాలోని నెవార్క్ సిటీ ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఇక తమ దేశానికి అమెరికానే గుర్తింపు ఇచ్చిందంటూ నిత్యానంద టీమ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా యూఎన్ఓ సమావేశానికి తమ ప్రతినిధి హాజరు అయ్యారంటూ నిత్యానంద బృందం చేస్తున్న ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News