Railway: రైల్వే ట్రాక్‌లపై విధ్వంసక ఘటనలపై రంగంలోకి దిగిన NIA
ఇటీవల రైల్వే కార్యకలాపాలకు అడ్డంకులు కలిగించే ఉద్దేశంతో కొంతమంది దుండగులు ట్రాక్‌లపై ఇనుప స్తంభాలు, రాళ్లు, ఇతర అడ్డంకులను ఉంచుతున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల రైల్వే కార్యకలాపాలకు అడ్డంకులు కలిగించే ఉద్దేశంతో కొంతమంది దుండగులు ట్రాక్‌లపై ఇనుప స్తంభాలు, రాళ్లు, ఇతర అడ్డంకులను ఉంచుతున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. పట్టాలపై పెద్ద బండరాళ్లను, ఇనుప రాడ్లు, సిలిండర్లను ఉంచి రైలును ట్రాక్ నుంచి తప్పిపోయేలా చేయడానికి దుండగులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ తాజాగా ఇలాంటి వాటిపై దర్యాప్తు చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)ని రంగంలోకి దింపింది. దుండగులను పట్టుకోవడానికి అలాగే, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడటానికి NIA దర్యాప్తును ప్రారంభించనుంది.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం జైపూర్‌లో ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో రైలు ప్రయాణాలపై భయాందోళనలు నెలకొన్న తరుణంలో NIAని దర్యాప్తు కోసం నియమించినట్లు తెలిపారు. రైల్వే యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం టచ్‌లో ఉన్నాం. ఎన్‌ఐఏ ఈ ఘటనలపై అన్ని రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖ కార్యదర్శుల పరస్పర సహకారంతో దర్యాప్తును కొనసాగిస్తుంది.
అన్ని జోన్‌లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్)తో NIA సంప్రదింపులు జరుపుతూ క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు మంత్రిత్వ శాఖ సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు సెప్టెంబర్ 22న, కాన్పూర్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న గూడ్స్ రైలు డ్రైవర్, ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను కనిపెట్టి అప్రమత్తం అయి రైలును నిలిపివేశాడు. సెప్టెంబర్ 15న కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ వెళ్లే ట్రాక్‌పై పాడైన సిలిండర్‌తో పాటు ఇతర కొన్ని వస్తువులను దుండగులు ఉంచారు. మరో సంఘటనలో భటిండా-ఢిల్లీ మార్గంలో పట్టాలపై తొమ్మిది రాడ్‌లు ఉంచగా, లోకోపైలెట్లు ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.