సర్జరీల లైవ్ టెలికాస్ట్‌పై సుప్రీంకోర్టులో వాదనలు..

SC Seeks Response From Centre, NMC Over Live Surgery Broadcast; Petitioners Say It's Like Virat Kohli Batting And Commentating Simultaneously

Update: 2023-10-13 16:39 GMT

న్యూఢిల్లీ : సంక్లిష్ట వ్యాధులకు సంబంధించిన సర్జరీల ప్రత్యక్ష ప్రసారం వల్ల చట్టపరమైన, నైతికపరమైన సమస్యలు తలెత్తుతాయని, వాటిని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శస్త్రచికిత్సల ప్రత్యక్ష ప్రసారాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్ఎంసీ)ను ఆదేశించాలని ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ పిటిషన్‌ ద్వారా కోరారు. దీన్ని శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. పిటిషన్‌పై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్ఎంసీ)లను ఆదేశించింది.

సర్జరీలను లైవ్‌లో టెలికాస్ట్ చేసే క్రమంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్లు కోరారని పేర్కొంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ‘‘శస్త్రచికిత్స చేసే సమయంలో సర్జన్లు లైవ్ డిస్కషన్ లో పాల్గొనడమంటే.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ, కామెంట్రీ చేసినట్టుగా ఉంటుంది. ఎయిమ్స్‌లో ఒక సర్జరీని లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా రోగి మరణించిన సందర్భం కూడా ఉంది. అనేక దేశాలు ఇప్పటికే సర్జరీల లైవ్ టెలికాస్ట్ ను బ్యాన్ చేశాయి’’ అని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


Similar News