కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ ట్రయల్స్ సక్సెస్..వివరాలివే?
ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని-ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని-ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ వివరాలను రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్‌సీ),డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)తో కలిసి అగ్ని-ప్రైమ్‌ను బుధవారం పరీక్షించినట్టు తెలిపింది. ఈ క్షిపణి దానికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తి చేసిందని పేర్కొంది. ఈ ప్రయోగాన్ని చీఫ్ ఆఫ్ డిపెన్స్ స్టాఫ్, డీఆర్డీవో, ఇండియన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. మూడు విజయవంతమైన ట్రయల్స్ తర్వాత క్షిపణి విశ్వసనీయతను ధ్రువీకరించినట్టు తెలిపారు. గతంలో 2023 జూన్, డిసెంబర్‌లలో కూడా దీనిని పరీక్షించారు.
కాగా, అగ్ని ప్రైమ్ అనేది డీఆర్డీఓ అభివృద్ధి చేసిన కొత్త తరం అణు సామర్థ్యం గల మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల శ్రేణి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంగేగాక అగ్ని-IV, అగ్ని-Vల సాంకేతిక పురోగతిని కలిగి ఉంటుంది. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలకు వ్యతిరేకంగా భారత్‌కు బలమైన శక్తిని అగ్ని ప్రైమ్ అందిస్తుందని భావిస్తున్నారు. అగ్ని శ్రేణి క్షిపణులు 1982లో రక్షణ శాఖ ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగం. అయితే ఆధునికత ఆధారంగా వీటిని మరింత తీర్చిదిద్దారు. అగ్ని ప్రైమ్ ట్రయల్స్‌ని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీఓ, ఎస్ఎఫ్‌సీలకు అభినందనలు తెలిపారు.