Harsh Goenka: ‘ఇక్కడ డైలీ రూ.600 సంపాదనకే దిక్కులేదు.. సేవింగ్స్ కావాలా?’ పారిశ్రామిక వేత్త ట్వీట్ పై నెటిజన్ల ఫైర్

హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చగా మారింది.

Update: 2024-09-19 12:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా ఎక్స్ వేదికగా చేసిన ఓ ట్వీట్ చర్చగా మారింది. మీరిచ్చిన సలహా బ్రిలియంట్ గా ఉందంటూనే ఆయనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..  గోయెంకా ట్వీట్ చేస్తూ.. 'ప్రతి రోజు రూ.600 సేవింగ్ చేస్తే అది ఏడాదికి రూ.2,19,000 అవుతుంది, రోజు 20 పేజీలు చదివితే ఏడాదికి 30 పుస్తకాలు అవుతాయి. ప్రతి రోజు 10 వేల అడుగుల నడిస్తే ఏడాదికి 70 మారథాన్ లు పూర్తి చేసినట్లు. స్మాల్ హ్యాబిట్స్ శక్తిని తక్కువ అంచనా వేయవద్దు' అంటూ పోస్టు చేశారు. అయితే ఆయన గతంలో చేసిన అనేక ట్వీట్లకు పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభిస్తే తాజా పోస్టుపై నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఏదైనా ఆలోచనలు కలలు కనే ముందు గ్రౌండ్ రియాల్టీ చూసుకోవాలని.. మెజారిటీ భారతీయులు రోజుకు రూ.600 సంపాదించేందుకు స్ట్రగుల్ అవుతుంటే మీరు రోజూ రూ.600 ఆదా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డాడు. అలాగే మెజార్టీ ఇండియన్స్ తమను తాము నిలదొక్కుకునేందుకు ప్రతి రోజు 15 కంటే ఎక్కువ గంటలు వెచ్చిస్తుంటే మీరు వారికి 20 పేజీలు చదవడానికి మరియు రోజుకు 10,000 అడుగులు నడవాలని అంటున్నారు. అంత సమయం, ప్రశాంత మనసు వారికి లభిస్తుందా? దురదృష్టవాశాత్తు మీ ప్రకటన జనాభాలో కొంత భాగానికి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ విమర్శించారు.

మరి కొంత మంది నెటిజన్స్ స్పందిస్తూ.. గోయెంకా వ్యాఖ్యలు ఆర్థిక వాస్తవికతతో సంబంధం లేదని ఆయన పోస్టు తక్కువ ఆదాయ కుటుంబాలు చేస్తున్న పోరాటాల నుండి డిస్‌కనెక్ట్ చేస్తోందని, పొదుపు అనేది నిస్సందేహంగా విలువైన ఆర్థిక అలవాటే అయినప్పటికీ మన దేశంలో కఠినమైన వాస్తవం ఏమిటంటే చాలా మంది వ్యక్తులు కొద్దిపాటి జీతాల కారణంగా అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడతారని కామెంట్ చేశారు. దేశంలో 81 కోట్ల మంది ప్రజలు ఇంకా ఉచిత రేషన్ పై జీవిస్తున్నారని, అంటే వారంతా కనీస వేతన సంపాదన కంటే దిగువనే ఉన్నారని గుర్తు చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ. తరాల సంపద కారణంగా భారతదేశం యొక్క 76వ అత్యంత సంపన్నుడు, భారతదేశ సగటు ఆదాయం కంటే ఎక్కువ పొదుపు చేయమని ఇతర భారతీయులకు సలహా ఇస్తున్నాడంటూ సెటైర్ వేశారు. మరో వైపు గోయెంకా సలహా బాగుందంటూ మరి కొంత మంది స్వాగతిస్తున్నారు. 


Similar News