నీట్-యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్వీ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ తాజా ఆదేశాలిచ్చింది.

Update: 2024-06-21 11:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ 2024 పరీక్షకు హాజరైన 1,563 మంది అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతిపాదించిన రీ-టెస్ట్‌పై స్టే విధించేందుకు లేదా జూలై 6న ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్వీ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ తాజా ఆదేశాలిచ్చింది. వేసవి సెలవుల తర్వాత జూలై 8న సుప్రీంకోర్టు నీట్‌కు సంబంధించిన వివిధ పిటిషన్లను విచారణ చేపట్టనున్న జూలై మొదటివారంలో మొదలయ్యే కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం తాజా పిటిషన్‌లపై బదులివ్వాలని ఎన్‌టీఏకు నోటీసులిచ్చింది. వీటిని పెండింగ్ పిటిషన్‌లతో పాటు జూలై 8న విచారించనున్నట్టు పేర్కొంది. ఇక, మేఘాలయకు చెందిన నీట్ అభ్యర్థులు వేసిన పిటిషన్‌కు సంబంధించి కేంద్రం, ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. పరీక్షల సమయంలో తాము 45 నిమిషాలు నష్టపోయామని, గ్రేస్ మార్కులు పొందిన 1,562 అభ్యర్థుల జాబితాలో తమను కూడా చేర్చాలని, రీ-టెస్ట్‌కు తమకు కూడా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా, గ్రేస్‌ మార్కులు తొలగించిన 1563 మంది విద్యార్ధులకు నీట్ రీ ఎగ్జామ్‌ జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించి, 30న ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 


Similar News