నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాల్లో 61కి తగ్గిన టాపర్‌ల సంఖ్య

తాజా ఫలితాల్లో టాపర్‌ల సంఖ్య ఇదివరకు ప్రకటించిన 67 నుంచి 61కి తగ్గింది.

Update: 2024-07-01 15:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ ఫలితాల్లో గ్రేస్ మార్కులు కలపడం వివాదాస్పదం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 1,563 మంది విద్యార్థులకు రీ-ఎగ్జామ్ నిర్వహించింది. తాజాగా వాటి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, తాజా ఫలితాల్లో టాపర్‌ల సంఖ్య ఇదివరకు ప్రకటించిన 67 నుంచి 61కి తగ్గింది. జూన్ 23న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,563లో 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 750 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు మినహాయించి, పాత స్కోర్ చాలని స్పష్టం చేశారు. గత పరీక్షలో హర్యానాలోని ఒక సెంటర్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. కానీ రీ-ఎగ్జామ్‌లో ఎవరూ పూర్తి మార్కులు సాధించలేదు. తత్ఫలితంగా, టాప్ స్కోరర్‌ల సంఖ్య అధికారికంగా 67 నుండి 61కి తగ్గింది. అభ్యర్థులు సవరించిన తమ స్కోర్‌కార్డుల కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చని పేర్కొంది. తాజా స్కోర్‌ల ఆధారంగానే కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని ఎన్‌టీఏ వెల్లడించింది. కాగా, వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్-యూజీ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించగా, దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.  

Similar News