కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్!
చైనా, జపాన్ సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: చైనా, జపాన్ సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలపై మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటికే లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మంగళవారం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆరోగ్య సౌకర్యాలు, ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయుష్ డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల లభ్యత, అంబులెన్సు, పరీక్షా పరికరాలు, అవసరమైన మందులు తదితర అంశాలపై డ్రిల్ నిర్వహించారు.
మాక్‌డ్రిల్ నిర్వహణలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. మాక్ డ్రిల్ నిర్వహణను పర్యవేక్షించారు. అలాగే రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను సమీక్షించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో నిర్ధారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి.