రేపు శరద్ పవార్ వారసుడి ఎన్నిక

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడిగా శరద్ పవార్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

Update: 2023-05-04 14:28 GMT

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడిగా శరద్ పవార్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. పవార్ వారసుడిని శుక్రవారం ఎన్నుకుంటామని ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తెలిపారు. శరద్ పవార్ నియమించిన ప్యానెల్ ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశమై ఎన్సీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటుందన్నారు. ఈ ప్యానెల్ లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మేనల్లుడు అజిత్ పవార్, సీనియర్ నాయకులు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్ ఉన్నారని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం తన ఆత్మకథ ‘లోక్ మేజ్ సంగతి’ రెండవ ఎడిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా శరద్ పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వారసుడిపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్సీపీ అధ్యక్ష పదవికి సుప్రియా సూలే, అజిత్ పవార్, జయంత్ పాటిల్ ముందంజలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. అయితే.. రాజీనామా నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవాలని శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ సహా పలువురు కోరుతున్నారు. ఆయన తన నిర్ణయాన్ని పున:పరిశీలించేందుకు 2, 3 రోజులు పడుతుందని అజిత్ చెప్పారు. 1999లో ఎన్సీపీని స్థాపించిన శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ ప్రజా జీవితం నుంచి విరమించుకునేది లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News