Supreme Court: భావప్రకటనా హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
భావప్రకటనా హక్కుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి (Congress MP Imran Pratapgarhi) వివాదాస్పద వీడియో పోస్ట్‌కు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: భావప్రకటనా హక్కుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి (Congress MP Imran Pratapgarhi) వివాదాస్పద వీడియో పోస్ట్‌కు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యతిరేకించినప్పటికీ.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును గౌరవించక తప్పదు’’ అని వ్యాఖ్యానిచింది. ‘‘కవిత్వం, సినిమాలు, సెటైర్స్, ఆర్ట్స్, సాహిత్యం వంటివి మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆర్టికల్ 21 ప్రకారం ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలి. అణచివేత ధరోణి పనికిరాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి అర్థవంతంగా ఉండాలి. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడటం కోర్టుల పని’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.
కేసు ఏంటంటే?
గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి గతేడాది డిసెంబరులో తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 46 సెకన్ల నిడివి ఉన్నా వీడియోలో ఇమ్రాన్ ఓ పెళ్లి వేడుక మధ్యలో నడిచివస్తుండగా ఆయనపై పూలవర్షం కురిసింది. బ్యాక్‌గ్రౌండ్ ఓ కవిత వినిపించింది. అయితే, అందులోని పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కాంగ్రెస్ ఎంపీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపైనే విచారణ చేపట్టిన కోర్టు.. గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్ర్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.