Canada PM : పాతబంధం ముగిసిపోయింది- అమెరికాతో సంబంధాలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు

అగ్రరాజ్యంపై కెనడా తీవ్రంగా స్పందించింది. కెనడా ఉత్పత్తులపై భారీగా టారీఫ్ లు విధించిన ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వాహన దిగుమతులపైనా 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2025-03-28 08:18 GMT
Canada PM : పాతబంధం ముగిసిపోయింది- అమెరికాతో సంబంధాలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: అగ్రరాజ్యంపై కెనడా తీవ్రంగా స్పందించింది. కెనడా ఉత్పత్తులపై భారీగా టారీఫ్ లు విధించిన ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వాహన దిగుమతులపైనా 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపైనే కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Canada PM Mark Carney) తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందన్నారు. అమెరికా టారిఫ్‌ (Trump Tariffs) ప్రకటనతో తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకొని మార్క్‌ కార్నీ.. ఒట్టావాకు తిరిగొచ్చి కేబినెట్‌ సభ్యులతో హుటాహుటిన సమావేశమయ్యారు. అమెరికా (USA)తో వాణిజ్యయుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. ‘‘ట్రంప్‌ టారీఫ్ లు అన్యాయమైనవి. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు ఉన్న స్నేహబంధాన్ని ట్రంప్‌ శాశ్వతంగా మార్చేశారు. ఆర్థికవ్యవస్థ బలోపేతం, భద్రత, సైనిక సహకారం విషయంలో అమెరికా-కెనడా మధ్య ఉన్న పాతబంధం ముగిసిపోయింది. ప్రతీకార వాణిజ్య చర్యలతోనే అమెరికాను ఎదుర్కొంచారు. ఆ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మా దేశాన్ని కాపాడుకునేందుకే మేం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాం’’ అని కెనడా ప్రధాని వెల్లడించారు.

సుంకాల విధింపు

డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి టారీఫ్ లపైన దృష్టి సారిస్తున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వాహనాలపై 25శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్‌ ప్రకటించారు. దేశీయ తయారీని వేగవంతం చేసేందుకు ఈ సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు. అయితే, విడిభాగాలు, తయారీ కోసం అంతర్జాతీయ సరఫరాపై ఆధారపడిన అమెరికా వాహన కంపెనీలకు దీనివల్ల ఆర్థికభార మరింత పెరగనుంది. అంతేకాకుండా, ఈ నిర్ణయం వల్ల కెనడా ఆటో పరిశ్రమకు పెద్ద షాక్ గా మారింది. దాదాపు 5 లక్షల ఉద్యోగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. దీంతో కెనడా సర్కారు తీవ్రంగా స్పందించింది.

Tags:    

Similar News