Viral News : కోడిగుడ్ల అమ్ముకునే చిరు వ్యాపారికి రూ.6 కోట్ల పన్ను నోటీసులు
కోడిగుడ్లు అమ్ముకునే(Eggs Seller) ఓ చిరు వ్యాపారికి రూ.6 కోట్ల పన్ను నోటీసులు(Rs 6 Crores Tax Notices) రావడం సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : కోడిగుడ్లు అమ్ముకునే(Eggs Seller) ఓ చిరు వ్యాపారికి రూ.6 కోట్ల పన్ను నోటీసులు(Rs 6 Crores Tax Notices) రావడం సంచలనం రేపింది. రోజూ బండిపై గుడ్లు అమ్ముకుంటూ వందా, రెండువందలు సంపాదించే తనకి ఏకంగా కోట్ల కొద్ది పన్నులు కట్టమని నోటీసులు రావడంతో అవాక్కయ్యాడు ఆ వ్యాపారి. ఈ ఘటన మధ్యప్రదేశ్(MP) లోని దమోహ్ జిల్లాలో జరిగింది. కోడిగుడ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే చిరువ్యాపారి ప్రిన్స్ సుమన్ కు ఐటీ అధికారుల నుంచి పన్ను ఎగవేత నోటీసులు అందాయి. రెండేళ్లలో రూ.50 కోట్ల వ్యాపార లావాదేవీలపై జీఎస్టీ(GST) ఎగవేసినట్టు.. వాటికి సంబంధించిన రూ.6 కోట్లను తక్షణమే చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే రూ. 49.24 కోట్ల ఆర్థిక లావాదేవీలకు వివరణ కోరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లు, రవాణా రికార్డులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల వంటి పత్రాలను సమర్పించాలని తెలిపింది. ఈ నోటీసులు అందుకున్న ప్రిన్స్, అతని కుటుంబ సభ్యులు తొలుత షాక్‌కు గురయ్యారు.
తన చిన్న వ్యాపారానికి ఇంత టాక్స్ ఎలా పడిందో తెలియక తికమకపడి, చివరకు దమోహ్‌లోని స్థానిక అధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. డిసెంబర్ 2022లో ఢిల్లీలో అతని పేరుతో “ప్రిన్స్ ఎంటర్‌ప్రైజ్” అనే నకిలీ కంపెనీ నమోదు చేయబడినట్లు తేలింది. ఈ కంపెనీ ప్రిన్స్ వ్యక్తిగత వివరాలను ఉపయోగించి GST నంబర్ పొంది, కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన తర్వాత మూసివేసారు. దీంతో అధికారులు కంపెనీ వివరాల ప్రకారం ప్రిన్స్ కు నోటీసులు అందించారు. అయితే అతని వివరాలు ఎలా ఆ నేరస్థులకు చిక్కాయనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.