Yunus: భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో చైనా పెట్టుబడులు పెట్టొచ్చు.. యూనస్ సంచలన వ్యాఖ్యలు

చైనా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-31 18:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Mohammad Yunus) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టిత ప్రాంతాలని, వాటికి బంగ్లాదేశ్ మాత్రమే సంరక్షకురాలని తెలిపారు. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో చైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు. వారు సముద్రాన్ని చేరుకోవడానికి వీలు కాదు. ఈ ప్రాంతానికి బంగ్లాదేశ్ మాత్రమే సముద్ర సంరక్షకురాలు. కాబట్టి ఈ ప్రాంతంలో చైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. చైనా ఆర్థిక వ్యవస్థకు అపరిమితమైన అవకాశాలు సృష్టించుకోవచ్చు. ఇక్కడ వస్తువులు తయారు చేయండి. వాటిని మార్కెటింగ్ నిమిత్తం చైనాకు తీసుకెళ్లండి. లేదా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయొచ్చు’ అని వ్యాఖ్యానించారు. బీజింగ్‌లో తాజాగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో యూనస్ ఈ వ్యాఖ్యలు చేయగా దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

యూనస్ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర కలకలం రేపాయి. ఈ కామెంట్స్‌పై ఆర్థికవేత్త, ప్రధాని మోడీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులు పెట్టడానికి స్వేచ్ఛ ఉందని, కానీ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయని చైనీయులకు విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఆందోళనకరమని తెలిపారు. కాగా, యూనస్ ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Tags:    

Similar News