మిహిర్ షా తాగుబోతు.. జుట్టు కత్తిరించుకుని, వేషం మార్చి..

ముంబై బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసు నిందితుడు మిహిర్‌ షా (24) తాగుబోతని పోలీసులు విచారణలో తేలింది. అరెస్టు చేసిన తర్వాత పోలీసుల విచారణలో తాను తరచూ మద్యం తాగేవాడని ఒప్పుకున్నాడు.

Update: 2024-07-16 09:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసు నిందితుడు మిహిర్‌ షా (24) తాగుబోతని పోలీసులు విచారణలో తేలింది. అరెస్టు చేసిన తర్వాత పోలీసుల విచారణలో తాను తరచూ మద్యం తాగేవాడని ఒప్పుకున్నాడు. ఇక కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విశ్వప్రయత్నాలు చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మీసాలు, గడ్డాలు తొలిగించాడు. విరార్‌లోని బార్బర్ షాపులో జుట్టు కత్తిరించుకున్నట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిహిర్ షా వాంగ్మూలాన్ని ధ్రువీకరించడానికి పోలీసులు బార్బర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ముంబైకి 65 కి.మీ దూరంలోని విరార్‌లోని అపార్ట్‌మెంట్‌ లో మిహిర్ షా దాక్కున్నాడు. నిందితుడి ఆచూకీ కోసం 11 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల తర్వాత ఎట్టకేలకు అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

అసలు కేసు ఏంటంటే?

జులై 7 న ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్‌ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్‌ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. ఇకపోతే, ఈకేసులో మిహిర్ షా తల్లిదండ్రులతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Similar News