బీఎండబ్ల్యూ కారు ప్రమాదం కేసు.. నిందితుడి కోసం గాలిస్తున్న ఆరు బృందాలు

మహారాష్ట్రలో జ‌రిగిన బీఎండ‌బ్ల్యూ కారు ప్రమాదం కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన మిహిర్ షా కోసం వెతుకుతున్నారు.

Update: 2024-07-08 06:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో జ‌రిగిన బీఎండ‌బ్ల్యూ కారు ప్రమాదం కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన షిండే వర్గానికి చెందిన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా కోసం వెతుకుతున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో మిహిర్ షానే కారుని నడుపుతున్నట్లు తేలింది. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది . ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే, మిహిర్ షాపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతడి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడి తల్లి, సోదరి ఆచూకీ కూడా తెలియాల్సి ఉంది.

శివసేన నేత రాజేష్ షా అరెస్టు

నిందితుడి తండ్రి రాజేష్ షా, అతని డ్రైవర్ రాజరుషి బిదావత్‌లను కోర్టులో హాజరుపరచనున్నారు. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదంజరగగా.. సాయంత్రం ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పోలీసులకు సహకరించకపోవడం వల్లే శివసేన నేత రాజేష్ షాను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.నిందితుడు రాజకీయ నేత కుమారుడు కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే, నిందితుడిపై కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్‌ షా పేరుతో ఉంది. ప్రమాదం జరిగాక నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.


Similar News