ప్రజ్వల్ రేవణ్ణ మాజీ డ్రైవర్ సంచలన ప్రకటన.. బీజేపీ నేతకు ఇచ్చిన పెన్ డ్రైవ్
కర్ణాటకలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రాగా, జేడీఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రాగా, జేడీఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రేవణ్ణ మాజీ డ్రైవర్ కార్తీక్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. అసభ్యకర దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఉన్న పెన్ డ్రైవ్‌ను బీజేపీ నాయకుడు దేవరాజే గౌడకు అందజేశానని తెలిపాడు. ఆ పెన్ డ్రైవ్‌ను ఆయన బీజేపీ వ్యక్తులకా, లేక మరోకరికి ఇచ్చారో నాకు తెలియదు, నేను మాత్రం దేవరాజే గౌడకు తప్ప పెన్‌డ్రైవ్ మరెవరికీ, ఏ కాంగ్రెస్ నాయకుడికి ఇవ్వలేదని పేర్కొన్నాడు.
వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ను డ్రైవర్ కార్తీక్, డీకే శివకుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులకు ఇచ్చినట్లు అతను నాతో అన్నాడని దేవరాజే గౌడ సోమవారం చెప్పగా, దానికి బదులుగా డ్రైవర్ మంగళవారం ఈ విధమైన ప్రకటన చేశాడు. పెన్ డ్రైవ్‌ను దేవరాజే గౌడకు మాత్రమే ఇచ్చాను, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ఇచ్చారంటూ నాపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు. తనకున్న భూమిని బలవంతంగా వారి పేరుపైకి మార్చుకుని రేవణ్ణ కుటుంబం తనను వేధించడంతో సహాయం కోసం దేవరాజే గౌడను సంప్రదించాను. ఒక కేసు విషయంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడంతో తనిని నమ్మి, నేను ఆయనకు పెన్ డ్రైవ్‌ను ఇచ్చాను. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) సమర్పిస్తానని కార్తీక్ చెప్పాడు.