'దట్ ఈజ్ మోడీ' ఎంపీ ఎన్నికల వేళ ఏపీ, తెలంగాణలో మోడీ నయా స్కెచ్

కేంద్రంలో హ్యాట్రిక్ విక్టరీ సాధించడమే టార్గెట్ గా పని చేస్తున్న బీజేపీ పార్టీ ప్రచార పర్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Update: 2024-04-09 13:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్రంలో హ్యాట్రిక్ విక్టరీ సాధించడమే టార్గెట్ గా పని చేస్తున్న బీజేపీ పార్టీ ప్రచార పర్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఈ పదేళ్ల తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఇంకా సెట్ సైట్ అయ్యే దశలో ఉండగానే బీజేపీ మరో కీలక నిర్ణయంతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి మోడీ చర్మిషానే నమ్ముకున్న బీజేపీ 'అబ్ కీ పార్ 400 పార్' నినాదంతో మోడీ ప్రసంగాలకు లోకల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మాట్లాడిన ప్రసంగాలను ఆయా స్థానిక భాషల్లోకి తర్జుమా చేస్తూ వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది. దీంతో ఈసారి మోడీని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తుండగానే ఆలోపే తమ వాదానాన్ని, తమ నినాదాన్ని స్థానిక ప్రజలకు వివరించేలా మోడీ వేస్తున్న ఈ లోకల్ స్కెచ్ అదిరిపోయిందంటూ బీజేపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.

దటీజ్ మోడీ:

దేశ రాజకీయాల్లో టెక్నాలజీ వాడుకోవడంలో బీజేపీకి తిరుగులేదనే పేరుంది. ఈసారి మోడీ స్పీచ్ లను స్థానిక భాషల్లోకి తర్జుమా చేసేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించబోతున్నదనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా మోడీ పేరున పలు స్థానిక భాషలతో కొత్త అకౌంట్లు ప్రారంభమయ్యాయి. గత ఫిబ్రవరిలోనే ఈ ఖాతాలు ప్రారంభించగా ఇప్పుడు వాటిల్లో మోడీ స్పీచ్ లను తర్జుమా చేసి అప్ లోడ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ తెలుగు, నరేంద్ర మోడీ మలయాళం, నరేంద్ర మోడీ కన్నడ, తమిళ్, ఒడియా, బెంగాల్, మరాఠి, పంజాబీ తదితర స్థానిక భాషల్లో మోడీ ప్రసంగాలను తర్జుమా చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ వారి అంచనాలకు చిక్కకుండా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో మోడీ స్ట్రాటజీయే వేరని, దటీజ్ మోడీ అంటూ ఆ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

సౌత్ ఇండియాపై స్పెషల్ ఫోకస్:

400 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవాలంటే బీజేపీకి దక్షిణ భారత దేశం ఎంత కీలకమో తెలుసు. అందుకే ఈసారి సౌత్ ఇండియాలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవడంపై దృష్టి పెట్టింది. ఆపరేషన్ సౌత్ పేరుతో వ్యూహాత్మకంగా పని చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతల వరుస టూర్లతో హైప్ క్రియేట్ చేస్తుండగా తాజాగా మోడీ స్పీచ్ లో స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి ప్రజలకు చేరువ చేయడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ట్విట్టర్ లో అందుబాటులో ఉన్న మోడీ లోకల్ స్పీచ్ లలో నాలుగు సౌత్ ఇండియా భాషలే ఉండటం విశేషం. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో ఆ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయనే అంచనాలతో ఆ మేరకు ఈ రాష్ట్రాల్లో మోడీ ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యేలా చేస్తున్నారు. మరి ఈ లోకల్ టచ్ ఎలాంటి ఫలితాలను కట్టబెడుతుంతో వేచి చూడాలి. 

Tags:    

Similar News