కొత్త క్రిమినల్ చట్టాలను ఉపసంహరించుకోవాలని అమిత్ షాకు లేఖ రాసిన ఎంకే స్టాలిన్

అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత సమీక్షించాలని, ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరారు

Update: 2024-06-18 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ఉపసంహరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సరైన చర్చలు, సంప్రదింపులు లేకుండానే తొందరపాటుతో కొత్త చట్టాలను రూపొందించారని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కొత్త చట్టాలను సమీక్షించాలని, ప్రస్తుతానికి చట్టాలను నిలిపివేయాలని కోరారు. 'మూడు కొత్త చట్టాలు భారత రాజ్యాంగంలోని లిస్ట్3 ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతమైన సంప్రదింపులు జరపాలి. రాష్ట్రాలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయం ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీల భాగస్వామ్యం లేకుండా కొత్త చట్టాలను పార్లమెంటు ఆమోదించిందని' స్టాలిన్ అన్నారు. కొత్త చట్టాల అమలుకు విద్యా సంస్థలతో చర్చలు అవసరం. లా కాలేజీ విద్యార్థులకు సిలబస్‌ను సవరించాల్సి ఉంటుంది. దీనికి తగిన సమయం కావాలి. కొత్త నిబంధనలను రూపొందించడం, ఇప్పటికే ఉన్న ఫారమ్‌లు, నిర్వహణ విధానాలను భాగస్వామ్య విభాగాలతో సంప్రదించి సవరించడం అత్యవసరం. తొందరపడి చేయలేమని స్టాలిన్ స్పష్టం చేశారు. గతేడాది ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలులో సమస్యలు ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. వాటిలో ప్రాథమిక లోపాలు ఉన్నాయని స్టాల్ అభిప్రాయపడ్డారు.

Similar News