సీబీఐ రిమాండ్ పిటిషన్‌.. కవిత, మాగుంట శ్రీనివాసులుపై అభియోగాలు

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది.

Update: 2024-06-26 18:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై సంచలన అభియోగాలను మోపింది. ఢిల్లీ మద్యం పాలసీకి సాధ్యమైనంత త్వరగా క్యాబినెట్ ఆమోదాన్ని పొందాలని అప్పట్లో సీఎం కేజ్రీవాల్ తపించిపోయారని సీబీఐ ఆరోపించింది. స్వయంగా కేజ్రీవాల్ చెప్పిన ఈ విషయాలు ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ద్వారా.. ఢిల్లీ సీఎం అదనపు కార్యదర్శి ప్రవేశ్ ఝాకు చేరాయని సీబీఐ పేర్కొంది. తమ విచారణలో ఈవివరాలను రాబట్టామని తెలిపింది.

బిభవ్ బుక్ చేసిన గెస్ట్ ‌హౌస్‌లో కీలక మీటింగ్

‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలోని సహ నిందితులు బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ ఆర్ పిళ్లై 2021 సంవత్సరం మే 20న ఛార్టర్డ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి వచ్చారు. 2021 సంవత్సరం మే 21న న్యూఢిల్లీలోని క్లారిడ్జెస్ హోటల్ సమీపంలోని గౌరీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉత్తమ్ గాల్వా కంపెనీ గెస్ట్ హౌస్‌‌‌లో వీరంతా నిందితుడు విజయ్ నాయర్, అప్రూవర్ దినేష్ అరోరా, కొందరు ఢిల్లీ మద్యం వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ గెస్ట్ హౌస్‌‌ను కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ బుక్ చేశారు’’ అని రిమాండ్ పిటిషన్‌లో సీబీఐ ప్రస్తావించింది. ‘‘2021-22 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల ఖర్చుల కోసం ఢిల్లీ నుంచి గోవాకు హవాలా మార్గాల ద్వారా మొత్తం రూ.44.54 కోట్లు వెళ్లాయి. 2021 జూన్ 21 నుంచి వివిధ తేదీల్లో హవాలా మార్గాల ద్వారా డబ్బు గోవాకు చేరింది’’ అని సీబీఐ ఆరోపించింది.

మాగుంట శ్రీనివాసులురెడ్డి, కల్వకుంట్ల కవిత..

‘‘'సౌత్ గ్రూప్'లో కీలక సభ్యుడిగా ఉన్న మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2021 మార్చి 16న ఢిల్లీ సెక్రటేరియట్‌‌కు వచ్చి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. 2021-22 సంవత్సరానికి రానున్న ఎక్సైజ్ పాలసీలో తమకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేయమని కేజ్రీవాల్‌ను కోరారు’’ అని సీబీఐ పేర్కొంది. ‘‘తప్పకుండా మద్దతు ఇస్తానని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మాట ఇచ్చిన కేజ్రీవాల్.. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను సంప్రదించాలని సూచించారు.ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో ముందు నుంచే కేజ్రీవాల్‌తో కవిత కలిసి పనిచేస్తున్నారు అనేందుకు ఇదే సాక్ష్యం’’ అని సీబీఐ కీలక ఆరోపణలు చేసింది.

Similar News