బిహార్ కు ప్రత్యేక హోదా.. డిమాండ్లు బయటపెట్టిన జేడీయూ

ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనతాదల్ (యునైటెడ్) పార్టీ తమ డిమాండ్లను బయటపెట్టింది.

Update: 2024-06-29 09:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనతాదల్ (యునైటెడ్) పార్టీ తమ డిమాండ్లను బయటపెట్టింది. కేంద్రప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా కాకముందే.. తమ డిమాండ్లు తీర్చాలని తీర్మానాలు ప్రవేశపెట్టింది. శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో జేడీయూ ఈ నిర్ణయం తీసుకుంది. బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు పార్టీ సమావేశంలో తీర్మానం చేసింది. ఇందులో బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. ఇంతేకాకుండా పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలు నివారించేందుకు పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలని పేర్కొంది.

జేడీయూ నేతలు ఏమన్నారంటే?

ఇటీవలే 65 శాతానికి పెంచిన బిహార్ రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా జేడీయూ మీటింగ్ లో ప్రస్తావించారు. సమావేశం తర్వాత జేడీయూ నేత ఒకరు మీడియాతో మాట్లాడారు. బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ కొత్తదేమీ కాదన్నారు. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అని అన్నారు. ఇక, ఇదే సమావేశంలో జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్‌ నేత సంజ్‌ఝాను ఎన్నుకొన్నారు.

Similar News