జైలుకి పంపారు కానీ.. ఎన్నడూ దుర్భాషలాడలేదు- ఇందిరాగాంధీపై లాలూ వ్యాఖ్యలు

రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీ టైంలో తాము అనుభవించిన వాటిని గుర్తుచేసుకున్నారు.

Update: 2024-06-29 10:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీ టైంలో తాము అనుభవించిన వాటిని గుర్తుచేసుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చాలా మందిని జైలుకు పంపారు కానీ.. ఎన్నడూ దుర్భాషలాడలేదని తెలిపారు. జర్నలిస్ట్ నలిన్ వర్మ రాసిన "ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975" అనే కథనాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా లాలూ షేర్ చేశారు. "అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్‌గా ఉన్నాను. 15 ఏళ్లకు పైగా భద్రతా చట్టం (మిసా) కింద నేను జైలులో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న చాలా మంది బీజేపీ మంత్రులకు ఈ విషయం తెలియదు. నేను, నా సహచరులు ఎవరూ మోడీ, నడ్డా సహా బీజేపీ మంత్రులెవరి గురించి ఆ ఉద్యమం సమయంలో వినలేదు. కానీ, ఈ రోజు మాత్రం వారు స్వాతంత్ర్యం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు.” అని లాలూ రాసుకొచ్చారు.

రాజ్యాంగాన్ని కాపాడారు

ఇందిరాగాంధీ కానీ.. ఆమె ప్రభుత్వంలోని మంత్రులు తమని "జాతీయ వ్యతిరేకులు" లేదా "దేశభక్తి లేనివారు" అని పిలవలేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇందిరా గాంధీ పోరాడారని అన్నారు. ఇకపోతే, జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. దేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా పరిగణించబడే ఎమర్జెన్సీకి ఈ ఏడాదితో 50 ఏళ్లు నిండాయి.

Similar News