ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

ప్రజలు ఎంతో ఆతృుతగా ఎదురుచూస్తున్న అమర్‌నాథ్ యాత్ర శనివారం ప్రారంభమైంది.

Update: 2024-06-29 10:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలు ఎంతో ఆతృుతగా ఎదురుచూస్తున్న అమర్‌నాథ్ యాత్ర శనివారం ప్రారంభమైంది. పవిత్ర గుహ దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 48 కి.మీ నున్వాన్-పహల్గామ్ మార్గం, 14 కి.మీ బాల్తాల్ మార్గంలో యాత్రికుల మొదటి బ్యాచ్ అమరనాథ్ దర్శనానికి బయలు దేరింది. అంతకుముందు రెండు మార్గాల్లోని యాత్రికుల బ్యాచ్‌లను సంబంధిత డిప్యూటీ కమిషనర్లతో పాటు సీనియర్ పోలీసు, సివిల్ అధికారులు సాగనంపారు. శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతి నగర్‌లోని యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుండి 4,603 మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. వారు కశ్మీర్ లోయకు చేరుకోగా అక్కడ యాత్రికులకు అధికారులు, స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. 1,881 మంది యాత్రికుల రెండవ బ్యాచ్ కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య భగవతి నగర్ బేస్ క్యాంపు నుండి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని 3880 మీటర్ల ఎత్తున్న ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి, యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, ఇతర పారామిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది భద్రతా సిబ్బంది మోహరించారు. వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యాత్రికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుని యాత్ర శివ భక్తులలో అపారమైన శక్తిని నింపుతుంది. భక్తులందరూ ఆయన ఆశీస్సులతో వర్ధిల్లాలని అన్నారు.

Similar News