మనీశ్ సిసోడియా పేరు చెప్పలేదు.. నేను, ఆయన అమాయకులం: కేజ్రీవాల్

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో బుధవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Update: 2024-06-26 18:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో బుధవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌‌ను మంగళవారం రాత్రి తిహార్ జైలులో అరెస్టు చేసిన సీబీఐ.. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించిన సీఎం కేజ్రీవాల్‌ను విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని, ఆయనను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. అయితే కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనను తిరిగి జూన్ 29న(శనివారం) రాత్రి 7 గంటలలోగా కోర్టు ఎదుట హాజరుపర్చాలని రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి అమితాబ్ రావత్ ఆర్డర్ ఇచ్చారు.

నేను సిసోడియా పేరు చెప్పలేదు : కేజ్రీవాల్

బుధవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన తర్వాత సీబీఐ వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలను ప్రైవేటీకరించాలని ఢిల్లీ క్యాబినెట్‌ సహచరుడు (మనీశ్ సిసోడిదియాను ఉద్దేశిస్తూ) సిఫార్సు చేశారని కేజ్రీవాలే చెప్పారని కోర్టుకు వెల్లడించింది. అయితే దీన్ని సీఎం కేజ్రీవాల్ ఖండించారు. ఆయన స్వయంగా వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్‌ సిసోడియా పేరును నేను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారమంతా అబద్ధం. సిసోడియాపై గానీ, ఇతర వ్యక్తులపై గానీ నేను ఎలాంటి నిందలు వేయలేదు. నేను, సిసోడియా, ఆమ్‌ ఆద్మీ పార్టీ అంతా అమాయకులమే. మీడియాలో మాపై దుష్ప్రచారం చేయాలని సీబీఐ ప్లాన్‌ చేస్తోంది. విశ్వసనీయ వర్గాల పేరుతో నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసి సంచలనం సృష్టించాలని చూస్తోంది’’ అని కోర్టు ఎదుట సీఎం కేజ్రీవాల్‌ వాదన వినిపించారు. లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది కాలంగా సీబీఐ తనను కేవలం సాక్షిగానే విచారిస్తోందన్నారు. గతంలో విచారించినప్పుడే మద్యం పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను సీబీఐకి చెప్పానన్నారు. ఇక సీబీఐ కస్టడీలో ఉండగా ప్రతిరోజూ 30 నిమిషాల పాటు భార్యను, లాయర్‌ను కలిసేందుకు కోర్టు అనుమతించింది. రోజూ కేజ్రీవాల్‌కు మందులు, ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది.

సుప్రీంకోర్టు నుంచి పిటిషన్‌ ఉపసంహరణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలోని మనీలాండరింగ్ కోణాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో సీఎం కేజ్రీవాల్‌‌కు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల బెయిల్ ఇచ్చింది. ఈడీ అప్పీల్ మేరకు ఆ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై బుధవారం రోజు విచారణ జరగనున్న తరుణంలో.. మంగళవారం రాత్రి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడం గమనార్హం. సీబీఐ తనను అరెస్టు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సమగ్ర పటిషన్‌ను దాఖలు చేస్తామని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈసందర్భంగా సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు జస్టిస్ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ అనుమతించింది. కాగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.

Similar News