మణిపూర్‌లో మిలిటెంట్ల దుశ్చర్య.. సీఆర్‌పీఎఫ్ బస్సుకు నిప్పు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భద్రతా ఏర్పాట్లపై హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కొద్ది గంటల్లోనే మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు.

Update: 2024-06-18 16:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భద్రతా ఏర్పాట్లపై హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కొద్ది గంటల్లోనే మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుకు సోమవారం అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కాంగ్‌పోక్పి బజార్‌లో గుంపుగా గుమికూడిన కొందరు దుండగులు బస్సు మైతీ వర్గానికి చెందినదని ఆరోపిస్తూ దాన్ని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దానిని తగులబెట్టినట్టు అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, మణిపూర్‌ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అమిత్ షా రాష్ట్రంలో అవసరమైతే అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు. హింసకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News