దిశ, వెబ్ డెస్క్ : పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి(Sabarimala temple) ఆలయంలో అపచారం(Misconduct) చోటుచేసుకుంది. పవిత్ర పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీద భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు ఫొటోల(Police Photo shoot)కు ఫోజులిచ్చారు. యూనిఫాంలో ఉన్న వీరంతా అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో కూర్చుని ఫొటో దిగడం సంప్రదాయాలకు పూర్తి విరుద్దమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలధారణ చేసుకుని, ఇరుముడితో వచ్చినవారికి మాత్రమే పదునెట్టాంబడి ఎక్కే అర్హత ఉంటుంది. సాధారణ భక్తులకు 18 మెట్ల పక్కన ఉండే మార్గం ద్వారా అనుమతిస్తారు. అలాంటి పవిత్రమైన ఈ పదునెట్టాంబడి మెట్లపైన భద్రతా పోలీసులు ఫోటోలకు ఫోజులివ్వడం వివాదస్పదమైంది. నవంబరు 24న మధ్యాహ్నం 1.30 గంటకు అక్కడ విధుల్లో ఉన్న 30 మంది పోలీసులు.. తమ డ్యూటీ ముగియడానికి ముందు పదునెట్టాంబడిపై స్వామికి వ్యతిరేకంగా నిలబడి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్థానిక మీడియాలో కథనం రావడం..భక్తుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి.
కేరళ హైకోర్టు సైతం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమోదించబోమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీజీ థంపి, ప్రధాన కార్యదర్శి వీఆర్ రాజశేఖరన్ లు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేరళ ఏడిజీపీఎస్ శ్రీజిత్ స్పందించారు. క్రమశిక్షణ చర్యల నేపధ్యంలో ఫోటో షూట్‌లో పాల్గొన్న 23 మంది పోలీసులను కన్నూర్ క్యాంప్‌కు అటాచ్ చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల 15న తెరుచుకుంది. రెండు నెలల పాటు సాగే మండల మకరు విళక్కు యాత్ర కోసం ఆలయాన్ని తెరువగా అయ్యప్పను దర్శించుకోడానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.