హ్యాట్రిక్ విజయం సాధించిన నితిన్ గడ్కరీ
గడ్కరీ 6,60,221 ఓట్లను సాధించి గెలుపును దక్కించుకున్నారు. పటోలేకు 4,44,212 ఓట్లను సాధించగలిగారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అత్యంత ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని అంతా భావించినప్పటికీ ప్రస్తుత అధికార ఎన్డీఏ కూటమికి విపక్ష ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. ఇదే తరహాలోనే మహారాష్ట్రలోనూ ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014 నుంచి నాగ్‌పూర్ నియోజకవర్గ ఎంపీగా ఉన్న నితిన్ గడ్కరీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 2,16,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలెపై విజయం సాధించారు. గతంలో భండారా-గోండియా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పటోలే కాంగ్రెస్‌లో చేరి గడ్కరీపై పోటీకి నిలబడ్డారు. అయినప్పటికీ గడ్కరీ 6,60,221 ఓట్లను సాధించి గెలుపును దక్కించుకున్నారు. పటోలేకు 4,44,212 ఓట్లను సాధించగలిగారు. మరోవైపు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి పార్టీలు కాంగ్రెస్, శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎస్పీ)లు 27 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాయి. మహాయుతి కూటమికి చెందిన బీజేపీ, శివసేన, ఎన్సీపీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష(ఆర్ఎస్పీ) 20 స్థానాల్లో ముందంజలో ఉంది. మహా వికాస్ అఘాడి కూడా 48 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా, ఆరు చోట్ల మహాయుతితో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.