గవర్నర్ పదవిపై మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు

ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గవర్నర్ పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-14 15:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గవర్నర్ పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ జాతీయ మదీదీయకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిసోడియా మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యంపై గవర్నర్ పదవి గుదిబండగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వాలు సజావుగా సాగాలంటే వెంటనే గవర్నర్ పదవిని రద్దు చేయడం మంచిదని పేర్కొన్నారు. దేశంలో ఎన్డీయేతర ప్రభుత్వాల విధులను అడ్డుకోవడం, ఆ ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా గవర్నర్ పదవులు తయారయ్యాయని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలుగా ఉంటున్నారని ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వెన్నముక లేని వారిగా తయారయ్యారని, వారిపై ఢిల్లీ ప్రజల్లో నమ్మకం పోయిందని ఈ సందర్భంగా మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో 17 నెలల పాటు జైలులో ఉన్న మనీష్ సిసోడియా ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.  


Similar News