Manipur Violence: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2023-08-25 11:46 GMT

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ నుంచి సీబీఐ కేసుల న్యాయ విచారణను పొరుగు రాష్ట్రమైన అస్సాంకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా న్యాయమూర్తులను కేటాయించాలని అస్సాంలోని గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ఆన్ లైన్‌లో విచారణ జరపడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఇంటర్‌నెట్ సర్వీసులను గువాహటి కోర్టులో ఏర్పాటు చేయించాలని మణిపూర్ ప్రభుత్వానికి ఆర్డర్ ఇచ్చింది.

బాధితులు, సాక్ష్యులు కోరుకుంటే అస్సాంలో విచారణకు నేరుగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని నిర్దేశించింది. మణిపూర్‌లో జరిగిన హింసకు సంబంధించి రెండు వర్గాల్లోనూ బాధితులున్నారని, వారిలో ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగింది? ఎవరు ఎక్కువ నష్టపోయారు? వంటి వివరాల లోతుల్లోకి తాము వెళ్లాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు వర్గాల్లోనూ బాధితులున్నారన్నది వాస్తవమని పేర్కొంది.

మైదాన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు రెండుచోట్లా బాధితులు, నిందితులు ఉన్నారని కామెంట్ చేసింది. మరోవైపు మణిపూర్‌లోని లైంగిక దాడుల బాధితులు మేజిస్ట్రేట్‌ల ముందు ఇస్తున్న వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు 27 కేసులను సీబీఐ నమోదు చేసింది. వీటిలో మహిళా బాధితులపై జరిగిన లైంగిక దాడుల కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు 80 మందికి పైగా అధికారులు, సిబ్బంది ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. సాక్షుల ప్రకటనలను రికార్డు చేయడం, సాక్ష్యాధారాలను సేకరించడం వీరి పని.


Similar News