Trudeau Resignation: - కెనడా ప్రధాని ట్రూడోకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన

భారత్‌తో దౌత్యసంబంధాలు దెబ్బతిన్న వేళ కెనడాలో(Canada) రాజకీయాలు అనూహ్యంగా మారాయి.

Update: 2024-10-17 04:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో దౌత్యసంబంధాలు దెబ్బతిన్న వేళ కెనడాలో(Canada) రాజకీయాలు అనూహ్యంగా మారాయి. ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau)కు సొంత పార్టీలోనే నిరసన సెగ తగులుతోంది. ఆయన నేతృత్వం వహిస్తున్న ‘లిబరల్‌ పార్టీ’కి ట్రూడో రాజీనామా చేయాలని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ ఎంపీ బహిరంగంగా డిమాండ్‌ చేశారు. ప్రజలు ఇప్పటికే ఆయన్ను చాలా భరించారని పేర్కొన్నారు. కాగా.. భారత్ తో ఏర్పడిన విబేధాలపై లిబరల్‌ పార్టీ ఎంపీ సియాన్‌ కాసే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రూడో తప్పుకోవాల్సిన టైం వచ్చిందనే వాదనతో ఏకీభవిస్తున్నా అని అన్నారు. ఇదే విషయాన్ని స్పష్టంగా, గట్టిగా చెప్పదలచుకున్నానని అన్నారు.

ట్రూడోపై తిరుగుబాటు

ఇకపోతే, ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ట్రూడో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాకుండా, కెనడియన్లతోపాటు సొంత పార్టీలో ఆయన అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. పార్టీ నాయకత్వం నుంచి వైదొలగాలని చాలా మంది అంటున్నారు. ఈ సందర్భంగానే ఎంపీ కాసే వాదనతో మాంట్రియాల్‌ ఎంపీ ఆంథోనీ హౌస్‌ఫాదర్‌ ఏకీభవించారు. పార్టీకి ట్రూడో నేతృత్వం వహించడం లేదా వైదొలగడంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో న్యూ బ్రన్స్విక్‌ ఎంపీ వేనె లాంగ్‌ కూడా ట్రూడో రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మరో ఎంపీ కెన్‌ మెక్‌డొనాల్డ్‌ కూడా ఆయన నాయకత్వాన్ని సమీక్షించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒట్టావా మాజీ ఎంపీ, ట్రూడో ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పనిచేసిన కేథరిన్‌ మెక్‌కెన్నా కూడా పార్టీకి కొత్త నాయకత్వం కావాలని ఇటీవల పిలుపునిచ్చారు.


Similar News