వరదల్లో చిక్కుకున్న మణిపూర్..లక్ష మందిపై ప్రభావం
రెమాల్ తుపాను కారణంగా మణిపూర్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. పలు ఘటనల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, లక్ష మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: రెమాల్ తుపాను కారణంగా మణిపూర్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. పలు ఘటనల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, లక్ష మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఇంఫాల్, నంబుల్ నదులలో నీటి మట్టాలు తగ్గినప్పటికీ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో అస్సాం రైఫిల్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక సామగ్రిని అందించడానికి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రంగంలోకి దిగాయి. ఇంఫాల్‌లోని నాగారం ప్రాంతంలో 37, 33 అస్సాం రైఫిల్స్‌తో కూడిన బృందాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలకు ఆహారం, మందులతో సహా అవసరమైన ఇతర వస్తువులను అందించారు.
ముంపు ప్రాంతాలలో ఒకటైన నాగారం జనసాంద్రత ఎక్కువగా కలిగిన ప్రాంతం. ఇక్కడి నివాసితులు అనేక మంది ఇప్పటికే ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితిపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. ‘వరద నీటిని తొలగించడానికి, నీటితో నిండిన ప్రాంతాలను శుభ్రం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం’ అని తెలిపారు. బాధిత ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. కాగా, గత వారం ఈశాన్య రాష్ట్రాలను తాకిన రెమల్ తుపాను కారణంగా మణిపూర్ లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.