అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వకండి: దీదీ వార్నింగ్
రామనవమి అల్లర్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేశారు.
కోల్‌కతా: రామనవమి అల్లర్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేశారు. బుధవారం జరిగే హనుమాన్ జయంతి వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. సోమవారం తూర్పు మిద్నాపోరెలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హనుమాన్‌కు తాను గౌరవం ఇస్తానని, అయితే అదే రోజు అల్లర్లకు ప్రణాళికలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హుగ్లీ రిష్రాలో ఇటీవలి హింసాత్మక సంఘటనను కూడా ప్రస్తావించారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని కొందరు వ్యక్తులు ఈ అల్లర్లకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రంజాన్ మాసంలో ముస్లింలపై ఎలాంటి దాడులు జరగకుండా, వారికి రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. మైనార్టీలకు న్యాయం అందుతుందని చెప్పారు. ఇటీవలె రామనవమి వేడుకల్లో బెంగాల్‌లో భారీగా అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.