మార్చి 15లోగా ఆర్మీని వెనక్కి పిలవండి.. భారత్‌కు మాల్దీవుల అల్టిమేటం

దిశ, నేషనల్ బ్యూరో : తమ దేశం నుంచి భారత ఆర్మీ మార్చి 15లోగా వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అల్టిమేటం ఇచ్చారు.

Update: 2024-01-14 13:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తమ దేశం నుంచి భారత ఆర్మీ మార్చి 15లోగా వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అల్టిమేటం ఇచ్చారు. ఈమేరకు భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈవిషయాన్ని మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయంలోని పబ్లిక్ పాలసీ సెక్రటరీ అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం వెల్లడించారని పేర్కొన్నాయి. “భారత సైనిక సిబ్బంది ఇక మాల్దీవులలో ఉండలేరు. ఇది అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ పరిపాలనాపరమైన విధాన నిర్ణయం’’ అని ఆయన చెప్పారని కథనంలో ప్రస్తావించాయి. రెండు నెలల క్రితం రెండుసార్లు ఇదే విషయంపై భారత్‌కు మాల్దీవుల ప్రభుత్వం సూచనలు చేసింది. అయినా ఇప్పటికీ భారత్ వైపు నుంచి ఎలాంటి చర్యలనూ చేపట్టలేదు.

భారత ఆర్మీకి డెడ్‌లైన్.. 

ఈనేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఇటీవల ఐదు రోజుల చైనా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ వెంటనే అక్కడున్న భారత ఆర్మీకి డెడ్‌లైన్ విధిస్తూ ఆయన ప్రకటన వెలువరించడం మారుతున్న సమీకరణాలకు అద్దంపడుతోంది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులు ఉన్నారు. కాగా, సైనిక దళాల ఉపసంహరణపై చర్చలు జరపడానికి మాల్దీవులు, భారతదేశం ఉన్నత స్థాయి కోర్ గ్రూపును ఏర్పాటు చేశాయి. ఈ బృందం తన మొదటి సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించింది. ఆ మీటింగ్‌లో భారత హైకమిషనర్ మును మహవార్ పాల్గొన్నారు. కాగా, “మాది చిన్నదేశమే కావచ్చు.. కానీ మమ్మల్ని బెదిరించే లైసెన్స్‌ను మీకు ఇవ్వం” అని ఇటీవల మొహమ్మద్ ముయిజ్జు తెలిపారు.

Tags:    

Similar News