కోల్‌కతా షాపింగ్ మాల్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం

షాపింగ్ మాల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయని, అప్రమత్తమైన అధికారులు భవనం లోపల అందరినీ ఖాళీ చేసినట్టు వెల్లడించారు.

Update: 2024-06-14 09:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఓ మాల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూబీ సమీపంలో ఉన్న అక్రోపోలిస్ మాల్‌లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. షాపింగ్ మాల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయని, అప్రమత్తమైన అధికారులు భవనం లోపల అందరినీ ఖాళీ చేసినట్టు వెల్లడించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు చెలరేగిన మంటలను ఆర్పేందుకు 10 వరకు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయని అధికారులు చెబుతున్నారు. 'ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. కొంతమంది అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి భవనంలోకి ప్రవేశించారు' అని ఒక అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. మాల్ ముందు ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇటీవలే సెంట్రల్ కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 


Similar News