Pappu Yadav: బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

బిహర్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్(Pappu Yadav)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi) నుంచి బెదిరింపులు వచ్చాయి.

Update: 2024-10-28 11:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహర్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్(Pappu Yadav)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi) నుంచి బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు చెందిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని గ్యాంగ్ స్టర్ హెచ్చరించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు పట్టించుకోకుంటే చంపేస్తామని, ఎప్పటికప్పుడు కదలికలను నిశితంగా గమనిస్తున్నామని పప్పూయాదవ్‌కు బెదిరింపులు వచ్చాయి. లారెన్స్‌ బిష్ణోయ్ గంటకు రూ.లక్ష చెల్లించి జైల్‌ సిగ్నల్ జామర్లను నిలిపివేస్తున్నాడని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత యాదవ్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఆ కాల్స్‌ను యాదవ్ పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది. ‘‘సాధ్యమైనంత త్వరగా భాయ్‌తో సెటిల్‌మెంట్‌ చేసుకోండి. మిమ్మల్ని పెద్దన్నయ్యలా భావించా. కానీ మీరు ఇబ్బంది పెట్టారు. తిరిగి కాల్‌ చేస్తే.. మిమ్మల్ని భాయ్‌తో కనెక్ట్ చేస్తా’’ అని రికార్డెడ్ ఆడియో మెసేజ్‌లో ఈ మాటలు వినిపించాయి. దీనిపై యాదవ్ పోలీసుల్ని ఆశ్రయించినట్లు సమాచారం.

సిద్ధిఖీ హత్యపై విమర్శలు

ఇకపోతే, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ కొద్దిరోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఆ ఘటనకు బాధ్యులను తామే అని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi gang) ప్రకటించింది. ఆ హత్యపై అప్పట్లో పప్పు యాదవ్ స్పందించారు. తనకు అనుమతిస్తే.. 24 గంటల్లో ఆ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేస్తానని బిష్ణోయ్ గ్యాంగ్ కు సవాల్ విసిరారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘బిహార్ బిడ్డ సిద్ధిఖీ హత్య విషాదకరం. ప్రముఖులనే బీజేపీ సర్కారు కాపాడలేకపోతే.. సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటి..?’’ అని ప్రశ్నించారు.


Similar News