Arvind Kejriwal అతిపెద్ద నేరస్తుడు.. కన్మాన్ సుఖేష్ మరో లేఖ
మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న కన్మాన్ సుఖేష్ చంద్ర మరో లేఖ రాశారు..Latest Telugu News
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న కన్మాన్ సుఖేష్ చంద్ర మరో లేఖ రాశారు. తాను పెద్ద నేరస్తుడు అయితే ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అతిపెద్ద నేరస్తుడని ఆరోపించారు. అంతకుముందు తాను రాసిన మొదటి లేఖలో మంత్రి సత్యేందర్ జైన్, జైళ్ల శాఖ అధికారి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను ఆప్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా లేఖలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
'మిస్టర్ కేజ్రీవాల్.. నీ ప్రకారం నేను దేశంలో పెద్ద నేరస్తుడిని. అయితే మీరేందుకు రాజ్యసభ సీటు ఇస్తానని నా దగ్గర నుంచి రూ. 50 కోట్లు తీసుకున్నారు? ఇది నిన్ను అతిపెద్ద నేరస్తుడిగా చేస్తుంది' అని లేఖలో పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడులో ఆప్ సీట్లు, పోస్టింగ్‌లకు బదులుగా పార్టీకి రూ. 500 కోట్ల అందించడానికి 20-30 మంది వ్యక్తులను తీసుకురావాలని తనను బలవంతం ఎందుకు చేశారని ప్రశ్నించారు.
కాగా, ప్రస్తుతం రూ. 200 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో జైలులో ఉన్నారు. అయితే కన్మాన్ లేఖకు కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. అందరు నేరస్తులు, దొంగలు, మోసగాళ్లు, కన్మన్ బీజేపీలో చేరుతారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జైల్లో ఉన్న ఏ నేరస్తుడినైనా ఎవరికైనా వ్యతిరేకంగా ప్రచారం చేయమని కోరుతారని బీజేపీపై సెటైర్లు వేశారు. త్వరలో కన్మాన్ కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలిపారు.