ఇకపై మంత్రులు కూడా ఆదాయపు పన్ను కట్టాలి

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వమే మంత్రుల పన్నుల భారాన్ని భరిస్తోంది.

Update: 2024-06-25 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రులు ఇకపై స్వంతంగా ఆదాయపు పన్ను కట్టాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలొని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో 52 ఏళ్ల నాటి నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వమే మంత్రుల పన్నుల భారాన్ని భరిస్తోంది.1972 నుంచి ఈ నిబంధన అమల్లో ఉండగా, మంత్రులకు చెల్లించే వేతనం, ఇతర భత్యాలపై రాష్ట్ర ప్రభుత్వమే వారి తరపున ఆదాయపు పన్ను కడుతోంది. తాజా నిర్ణయం ఐదు దశాబ్దాల ఈ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మంత్రుల జీతాలు, ప్రోత్సాహకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 1972 నిబంధనను కొట్టివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ ఈ అంశాన్ని ముందుకు తీసుకురాగా, మంత్రులు స్వయంగా ఆదాయపు పన్ను చెల్లించాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సూచించారు. ఈ సూచనను ఆమోదించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మంత్రులు, అధికారులు స్వయంగా కరెంట్ బిల్లులు చెల్లించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. 


Similar News