తొలిసారి రాజ్యసభకు వెళ్లనున్న ప్రియాంక గాంధీ?
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఆ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది. కాగా.. ప్రియాంక గాంధీ రాజ్యసభకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఆ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది. కాగా.. ప్రియాంక గాంధీ రాజ్యసభకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో నడ్డా పదవీకాలం ముగియడంతో.. ఖాళీగా ఉన్న ఆసీటు ప్రియాంకకు దక్కేలా ఉంది. ఖాళీగా ఉన్న రాజ్యసభ ఎంపీ పదవి సోనియా లేదా ప్రియాంకకు దక్కుతుందని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ అన్నారు.
రాజ్యసభ ఎంపీ పదవిపై సోనియాగాంధీ, ప్రియాంక గాంధీతో చర్చిస్తామన్నారు ప్రతిభా సింగ్. వారు ఇష్టపడితే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి వారి పేర్లను పంపుతామన్నారు. ప్రస్తుతం సోనియా రాయ్ బరేలీ నుంచి లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ప్రియాంక గాంధీ ఇంతవరకు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించలేదు.
2018లో హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. మెజార్టీ ప్రకారం ఆ రాష్ట్రం నుంచి నడ్డాను రాజ్యసభకు పంపారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 68 స్థానాల్లో 40 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో నడ్డా స్థానం నుంచి సోనియా గానీ ప్రియాంక గానీ రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని మూడు రాజ్యసభ స్థానాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. నడ్డాతో పాటు, ఇందు గోస్వామి, సికిందర్ కుమార్ రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు.