Heathrow Airport: ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన హీత్రో ఎయిర్‌పోర్టు మూసివేత
ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన హీత్రో ఎయిర్‌పోర్టుని (Heathrow Airport) 24 గంటలు మూసివేశారు. లండన్‌లోని (London) హీత్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన హీత్రో ఎయిర్‌పోర్టుని (Heathrow Airport) 24 గంటలు మూసివేశారు. లండన్‌లోని (London) హీత్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో, మార్చి 22 వరకు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్‌పోర్టుకు పవర్ సప్లై చేసే ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌లో (Power substation) అగ్నిప్రమాదం జరగింది. దీంతో, భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. 24 గంటల వరకు ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయానికి రావద్దని.. మరిన్ని వివరాల కోసం విమానయాన సంస్థను ఆశ్రయించాలని అధికారులు కోరారు. అయితే తమ కార్యకలాపాలను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టతనివ్వలేదు.
గురువారం రాత్రి ఘటన
గురువారం రాత్రి 11:30 గంటలకు మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు విమానాశ్రయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంటలు అదుపులోకి తీసుకోవడానికి తమ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ.. విద్యుత్ సరఫరాను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ప్రమాదం జరినప్పటి నుంచి అనేక విమానాలను దారి మళ్లించామని..వాటికి సంబంధించిన వివరాల కోసం ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ (FlightRadar24)ను ఆశ్రయించాలని సూచించారు. అంతేకాకుండా, హీత్రోకు వెళ్లాల్సిన కనీసం 120 విమానాలను దారి మళ్లించాల్సి ఉంటుంది. విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమీపంలోని వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంటలను ఆర్పడానికి 10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.