ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే జైలు నుంచి పాలిస్తారా?.. అలా జరుగుద్దా?
లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువులు ఆప్ నేతలు ఇప్పటికే అరెస్ట్ అయి జైలులో ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువులు ఆప్ నేతలు ఇప్పటికే అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. త్వరలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ, ఈడీలు నోటీసులు జారీ చేసి విచారించాయి కూడా. మద్యం కుంభకోణంలో అవకతవకలు, అవినీతి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే.. ఇందులో ఇమిడి ఉన్న మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసు తీవ్ర ప్రకంపనలు రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఇప్పటికే సీబీఐ, ఈడీలు పలు దఫాలుగా ప్రశ్నించాయి. తాజాగా మరోసారి ఈడీ విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు అందాయి.
అయితే, ఆయన హాజరుకాకపోవడంతో ఈడీ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరుంటారు, ఎవరు పాలిస్తారనే ప్రశ్నలకు ఆప్ సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే జైలు నుంచే పాలన సాగించే విధంగా కోర్టు అనుమతి తీసుకుంటామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసినా జైలు నుంచే ప్రభుత్వం నడపాలని ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌కు సూచించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి రాజకీయంగా వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.