Karge: మణిపూర్‌లో శాంతి పునస్థాపనకు జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతి ముర్ముకు ఖర్గే లేఖ
మణిపూర్ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం లేఖ రాశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ సంక్షోభం (Manipur crisis)లో జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu)కు మంగళవారం లేఖ రాశారు. గత 18 నెలలుగా రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్నా ప్రజలకు భద్రత కల్పించడంలో మణిపూర్ ప్రభుత్వం, కేంద్రం విఫలమయ్యాయని ఆరోపించారు. శాంతిభద్రతలు క్షీణించడం వల్ల దాదాపు లక్ష మంది జనాభా అంతర్గతంగా నిరాశ్రయులయ్యారని, వారిని వివిధ సహాయ శిబిరాలకు తరలించారని గుర్తు చేశారు. అంతేగా రాష్ట్రంలో హింస కారణంగా మహిళలు, పిల్లలు సహా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగ సంరక్షకురాలిగా, మీరు రాజ్యాంగబద్ధమైన హక్కును కొనసాగించడం తప్పనిసరి అని నేను నమ్ముతున్నాను. మణిపూర్‌లోని దేశ పౌరుల జీవితాలు, ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోండి. మీ జోక్యంతో మణిపూర్ ప్రజలు మళ్లీ గౌరవంగా తమ ఇళ్లలో శాంతియుతంగా జీవిస్తారనే నమ్మకం నాకు ఉంది’ అని పేర్కొన్నారు.