Jharkhand: రేపే జార్ఖండ్ రెండో విడత..12 జిల్లాల్లోని 38 స్థానాల్లో పోలింగ్
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.12 జిల్లాల్లోని 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగనుంది.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్(Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.12 జిల్లాల్లోని 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 55 మంది మహిళా క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తంగా 1.23 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా అందులో 147 మంది థర్డ్ జెండర్లు (Third Genders) ఉన్నారు. ఇందుకు గాను ఈసీ 14,218 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఏడు వేల బూత్‌లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అత్యంత సమస్యాత్మకమైన 31 బూత్‌లతో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ స్టేషన్ల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి రవికుమార్ తెలిపారు. 239 పోలింగ్ స్టేషన్లను పూర్తిగా మహిళలు, 22 బూత్‌లను వికలాంగులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
బరిలో హేమంత్, కల్పనా సోరెన్
రెండో దశలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో సీఎం హేమంత్ సోరెన్ (Hemanth soren), ఆయన భార్య కల్పనా సోరెన్ (kalpana soren), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ(Babulal marandi), ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరీ, అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర నాథ్ మహ్తో, ఏజేఎస్‌యూ పార్టీ చీఫ్ సుదేశ్ మహ్తోలు ఉన్నారు. ఇక ఇటీవలే జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నుంచి బీజేపీలో చేరిన హేమంత్ వదిన సీతాసోరెన్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. సీఎం సోరెన్ బర్హైట్ స్థానం నుంచి బరిలో నిలవగా, కల్పనా సోరెన్ గాండే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాగా, 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసీ రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరిగింది. రెండు దశల ఫలితాలు ఈ నెల 23నే విడుదల కానున్నాయి. తుది దశ పోలింగ్ పూర్తైన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం వెలువడబోయే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం అత్యధికంగా 29 సీట్లు, బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్, ఆర్జేడీతో కలిపి జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Read More...
Maharashtra Polls: మహారాష్ట్ర ఎన్నికల వేళ చిక్కుల్లో కాషాయ పార్టీ..!